Sunday, June 17, 2012

ఎరువులు, విత్తనాల సమస్యలతో ఖరీదైన ఖరీఫ్


భారతదేశ రైతులు వాడే రసాయనిక ఎరువులు ఇతర దేశాలతో పోల్చితే చాల తక్కువ, మన దేశం లో ఎరువుల వాడకం పూర్తిగా రుతుపవనాలపై ఆదారపడి ఉంది. వర్షాలు సకాలంలో వచ్చినట్లయితే మరింత పంట దిగుబడి కోసం మన  రైతులు ఎరువులను ఎక్కువ మోతాదు లో వాడుతూ ఉంటారు. ప్రస్తుతం ఐరోపా దేశాల  రాజకీయ ఆర్థిక పరిస్థితులు వలన ప్రపంచ దేశాల మార్కెట్లు ఒడిదుడుకులకు గురి అవుతున్నాయి, భారత దేశం ఆర్థిక వ్యవస్థ కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటుంది. మనదేశం వాడే రసాయనిక ఎరువులు ఎక్కువ భాగం దిగుమతుల ద్వార సమకూర్చుకుంటున్నవే, అయితే ప్రపంచ దేశాల మార్కెట్లు అస్థిరత వలన మన రూపాయి విలువ ఘోరంగా పడిపోయి మనము దిగుమతి  చేసుకోబోయే ఎరువులకు ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఎరువుల తయారీకి కావలసినటువంటి చమురు, నాప్త, సహజ వాయువు యొక్క ధరలు పెరుగుతూ ఉండటం వలన ఎరువుల ధరలు కూడా తప్పనిసరిగా పెరుగుతున్నాయి.

ఇప్పటికే పెరిగిఉన్న వ్యవసాయఖర్చులతో  మన  రైతులు సతమతమౌతుండగా, పెరగనున్న ఎరువుల ధరలు రైతులను  మరింతగా భాదించనున్నాయి. భారత దేశం దిగుమతి చేసుకునే ఎరువులలో ముఖ్యమైనవి  DAP, యూరియా, పోటాష్,  అయితే విరివిగా వాడబడే DAP ఇప్పటికే Rs .987 .00  ( 50 Kg ) కాగా, అది మరింతగా పెరిగే అవకాసం లేకపోలేదు. అలాగే  పోటాష్ Rs .720 .00  ( 50 Kg ) కాగా , రూపాయి విలువ పతనంతో పోటాష్ ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలతో పాటు క్రిమి సంహారక రసాయనాల ధరలు కూడా పెరుగుతున్నాయి, మన రైతులు ఎక్కువగా వాడే ఇమిడా క్లోప్రిడ్ (IMI) , ఎసిటామి ప్రైడ్ (ACE) వంటి పురుగుల నివారణ మందుల ధరలు ఇప్పటికే  Rs .100 వరకు పెరిగిఉన్నాయి. రూపాయి విలువ తరిగి పోవడం, రెండు శాతం వరకు విధించిన కేంద్ర ఎక్సైజ్ సుంకం, కెమికల్ ధరలు పెరగ డం వంటి కారణాలతో వీటి పెంపు అనివార్యమైనది.

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గడం, ఎరువుల సబ్సిడీలలో కేంద్ర ప్రభుత్వం కొత విధించడం, పెరిగిన చమురు ధరల వంటి కారణాలతోఎరువుల ధరలు 30% వరకు పెరిగాయి. మన ప్రభుత్వం ఏప్రిల్ 2012 నుండి ఇప్పటివరకు ప్రధాన ఎరువులైనటువంటి DAP, NPK(నైట్రోజెన్, ఫాస్ఫరస్, పోటాష్) ల పై 27% వరకు సబ్సీడిలో కోత విధించింది. గత ఆర్ధిక సంవత్సరంలో DAP మీద Rs 19,763  (టన్ను) సబ్సీడి కాగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో అది Rs 14,350 (టన్ను) కు తగ్గించబడింది. అదేవిధంగా  MOP ( మురియేట్ అఫ్ పోటాష్)  మీద సబ్సీడి గత ఆర్ధిక సంవత్సరంలో Rs 16,054 (టన్ను) కాగా అది ప్రస్తుతం Rs 14,440 (టన్ను) కు తగ్గించబడింది. నైట్రోజెన్, ఫాస్ఫరస్, పోటాష్ వంటి పోషక ఎరువులపై సబ్సీడీలను  వరుసగా 11.6%, 32.6% మరియు 10.3% వరకు తగ్గించడం జరిగింది.

మన ప్రభుత్వాలు తగినంత స్థాయిలో సబ్సీడీలను అందజేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన ధరలు లేక, రుణ సౌకర్యాలు లేక, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు భరించలేక సతమతమవుతు  వ్యవసాయం చేస్తున్న రైతులకు సబ్సీడీలపై కోత విధించడం ఆశానిపాతం లాంటిది. ఒకవేళ ప్రభుత్వం రైతులకు కల్పించే సబ్సీడీలను తొలగించదల్చుకుంటే, రైతులకు తాము పండించిన పంట ఉత్పత్తుల ధరలు తామే నిర్ణయించుకునే స్వేఛ్చ నివ్వాలి,  తమ పంట ఉత్పత్తులను దేశంలో ఏ ప్రాంతం లోనైనా అమ్ముకునే అవకాశం ఇవ్వాలి అంతే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విషయం లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు.  ఈ UPA  ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్ ధరలను పెంచుకుంటూ పోతుంది. పెంచిన ప్రతిసారి ఏవో సాకులు చూపుతూ, నష్టాల్లో ఉన్నాయంటున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మరి అదే నష్టాలలో ఉన్న భారతీయ రైతులకు వారి పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఎందుకు నిర్ణయించరు?, ప్రోత్సాహకాలు మాట అటు ఉంచి ఎరువులపై సబ్సిడీలను తగ్గించడమేమిటి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల విషయంలో చూపిన శ్రద్ధ  60  కోట్ల మంది  రైతుల పై లేకపోవడం ఏమిటి, అంత  నిర్లక్ష్యం ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం తన లోటు బడ్జెట్ ను పూరించే ప్రయత్నం లో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది వాటిలో భాగంగానే ఎరువులపై సబ్సిడీలలో కోత విధించింది. ఈ రసాయనిక ఎరువులలో తగ్గించిన సబ్సిడీల మొత్తాలను యధాతదంగా ఆర్గానిక్ ఎరువులు మరియు సహజ ఎరువులకు మళ్ళించడం జరుగుతుందని మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు గత మాసంలోని ప్రకటించారు. మనము, మన ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సాహించాల్సిందే, కాని మన రైతులలో ఎక్కువమంది రసాయనిక ఎరువుల పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు, రసాయనిక  ఎరువులపై సబ్సిడీలను తగ్గించడం వారికి పెను భారం కానుంది, తప్పని సరిగా వారి నుండి నిరసన ఎదురవుతుంది.. కేంద్ర ఎరువులు మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖ  ప్రకటన ప్రకారం ఎరువులపై సబ్సిడీలను నేరుగా లబ్దిదారులైన రైతులకే అందేట్టు చేయడం అనేది ఎంతో ఉపయోగకరమైనది. దీని వలన ఎరువుల డీలర్ల , రిటైలర్ల అవకతవకలను నివారించే అవకాశం ఉంటుంది. అలాగే మన రాష్ట్రం లో డీలర్ల వద్ద గత సంవత్సర నిల్వలు ఉన్నందున అవి పాత ధరలకే విక్రయించే విధంగా మన వ్యవసాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది , దీనివలన కొంత మేరకు పెరిగిన ధరల భారం నుండి బయట పడవచ్చు. రైతులు కూడా రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి వ్యవ సాయాధికారులు సూచనల మేరకు ఆర్గానిక్ ఎరువులు వంటి సహజమైన మరియు ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలి.దీని వలన ఎరువులపై పెట్టే పెట్టుబడి కొంత తగ్గించు కోవచ్చు.

ఇక విత్తనాల విషయానికి వస్తే  పరిస్థితి అందరికి తెలిసిందే, పెద్ద పెద్ద క్యూలు, రాత్రింబగళ్ళు జాగారాలు, పోలీసులు, లాఠిచార్జీలు,  ఇంత చేసి పొలం లో నాటిన తర్వాత మొలకెత్తని నాసిరకపు విత్తనాలు. మన రాష్ట్రములో ప్రధానమైన వ్యాపార పంటలైనటువంటి ప్రత్తి, వేరుసెనగ  విత్తనాల పంపిణీ లోనే ఈ ధోరణి  సాగుతుంది. ముఖ్యంగా ప్రత్తి విత్తనాల ధరలు, రాయల్టీల తో రైతులను బలి తీసుకుంటున్నాయి, ముఖ్యంగా Monsanto తాము అమ్ముతున్న BT ప్రత్తి విత్తనాలతో గుత్తాధిపత్యం కొనసాగిస్తుంది, తమ టెక్నాలజీలను ఇతర విత్తన కంపెనీలకు అందించి లైసెన్సు ఒప్పందాల ద్వారా తమ BT విత్తనాలను ఇతర కంపెనీలు కూడా అమ్మే విధంగా ప్రోత్సహిస్తూ మార్కెట్ లో మరే ప్రత్యామ్నాయ విత్తనాలు దొరకకుండా రైతులను పూర్తిగా తమ BT చక్రభంధం లో బందీలను చేస్తున్నాయి. ప్రస్తుత ఉన్న పరిస్థితులలో రైతులు తమ పంట విత్తనాలపై సార్వభౌమాధికారం ఎప్పుడో కోల్పోయారు, టెక్నాలజీ అనే వలయం లో చిక్కుకొని  కంపెనీల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారు.

ప్రతి మూడు సంవత్సరాలకొక మారు మెరుగుపరచిన నూతన BT వంగాడలంటూ ధరలను తమ ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు కేవలం 6 % గా ఉండే ప్రత్తి విత్తనం ఖర్చు ఇప్పుడు దాదాపు 35%  వరకు పెరగింది అంటే,  ఈ విత్తనాల కంపెనీలు తమ వ్యాపార లాభం కోసం రైతులను ఏ విధంగా బలి తీసుకుంటున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.రైతులుగాని, రైతుసంఘాలుగాని టెక్నాలజీ కి తాము ఎప్పుడు వ్యతిరేకం కాదు, అయితే టెక్నాలజీ పేరుతో విత్తన మార్కెట్ ను, రైతులను తమ గుప్పెట్లో పెట్టుకొని గుత్తాధిపత్యం కొనసాగిస్తే ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిందే. మన దేశం లో పటిష్టమైన విత్తన చట్టం రాకుండా ఈ బహుళజాతి  కంపెనీలు మన ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి అనడంలో కూడా కొంత వాస్తవం లేక పోలేదు.  ప్రభుత్వం తప్పనిసరిగా విత్తనాల ధరలు, నాణ్యత విషయం లో జోక్యం చేసుకొని విత్తన కంపెనీల ఆధిపత్యాన్ని నియంత్రణ చేయాలి.

ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో  రైతులకు కావాల్సిన విత్తనాల డిమాండ్ ను ముందుగానే లెక్కించి వారికి సరియైన సమయంలో అవసరమైన మొత్తంలో అందేట్లు మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాల తయారీదారులపై  చర్యలు తీసుకొని అవి మార్కెట్ లో సరపరా లేకుండా చూడాలి. వేరుసెనగ, సెనగ వంటి విత్తనాలపై ప్రస్తుతం అమలులో ఉన్న సబ్సిడీలను కొనసాగించాలి. మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన AP seeds  ని బలపరచి, విత్తనాల మార్కెటింగ్ లో కొన్ని విశేషఅధికారాలు  కల్పించాలి. ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు తమ వంతు కృషిగా దేశీయ పరిజ్ఞానంతో  బహుళజాతి కంపెనీలకు ధీటుగా కొత్త వంగడాలను సృష్టించాలి. రైతులు కూడా సంఘటితమై విత్తనాల సరఫరా, నాణ్యత విషయం లో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయ పరచుకోవడం వలన ఈ విత్తన పంపిణీలో ఒడిదుడుకులను అధిగమించవచ్చు.

ఇప్పటికే పెరిగిన ఎరువుల,పురుగు మందుల ధరలు, పెరిగిన విత్తనాల ఖర్చు, తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు మొదలగు వాటితోఈ ఖరీఫ్ సీజన్  చాల ఖరీదైన సీజన్ గా మారింది . ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేయలేం అంటూ రైతులు వాపోతున్నారు, వ్యవసాయ అధికారులు మరియు ప్రభుత్వము వారికి  సహాయ సహకారాలు అందించి  చైతన్యపరుస్తారని ఆశిద్దాం.

´