రాష్ట్రం అంటే మనుషులు మాత్రమే కాదు , రాష్ట్రం అంటే మట్టి కూడ.. గురజాడ గారు దేశమంటే మనుషులు అని ఉదాహరించినా, వాస్తవ పరిస్థితులలో మన రాష్ట్రం పరిస్థితి చూస్తే మట్టి కూడ అని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే రాష్ట్రం అనగా అడవులు,కొండలు, గనులు, పంట పొలాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఖరీదైన వ్యాపార భవన సముదాయాలు, రింగు రోడ్లు, SEZ లు , టెక్నాలజి పార్కులు .. ఇవే అనే అభిప్రాయం మన పాలక వర్గానికి వచ్చిన తర్వాత .. రాష్ట్రం అంటే మనుషులు అనే భావం ఎప్పుడో పోయింది. భూమికి , మనుషులకి మధ్య అభివృద్ధి పేరుతో కార్పోరేట్ కారిడార్లు తెరుచుకున్న తర్వాత మట్టికి మనిషికి మధ్య ఉన్న జీవాత్మక అనుభందంతో పాటు వ్యాపారత్మక అనుభందం బలపడింది. గ్యాసు పైపులైన్లు, పోర్టులతో, పవర్ ప్రాజక్టుల పేరుతో భూమి అంతా ప్రజలనుండి కొన్ని కుటుంబ సంస్థల చేతులలోకి మారిన తర్వాత... ఇంకెక్కడి అభివృద్ధి , ఇంకెక్కడి శాంతి సౌభాగ్యాలు ..నిత్యం ఉద్యమాలు, కాల్పులు ,మరణాలు తప్ప…
ప్రత్యేక ఆర్ధికమండళ్ళు ( SEZ) ,భారీ పరిశ్రమలు, అభివృది పనుల పేరుతో మన ప్రభుత్వం లక్షల ఎకరాల భూమి సేకరిస్తూ ఉంది. ఇందులో ఎక్కువ భాగం రైతుల నుండి సేకరించినవే.. అందులో కూడా భూములు పోగొట్టుకున్న రైతులు ఎక్కువమంది రెండు..మూడు ఎకరాలు సాగు చేసుకొని జీవించే పేద రైతులే. మన ప్రభుత్వం సెజ్ లు మరియు భారీ పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్నపుడు, ఆ భూములు పోగొట్టుకున్న రైతులకు ప్రత్యామ్నాయంగా ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాని కొన్నిచోట్ల అయిదు సంవస్తరాలు అయిన పరిశ్రమల ఏర్పాటు ఇంకా జరుగ లేదు. ఇప్పుడు ఆ రైతులకు ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ జరింగిందని చెప్పవచ్చు. సాగుచేసుకునే అవకాశం లేక, ఇంకా ప్రారంభించని ఆ పరిశ్రమలలో ఉపాధి దొరకక, పట్టణాలకు వలసలు వెళుతున్నారు. రెక్కల కష్టం, వ్యవసాయం తప్ప మరే ఇతర వృత్తి నైపుణ్యం లేని, పెద్ద చదువులు చదవని ఈ రైతులు..వారి పొలాలలో స్థాపించబోయే పరిశ్రమలలో మరి టాయిలెట్లు కడగాలా? రోడ్లు ఊడ్చాలా? కార్లు తుడవాల? తరతరాలుగా జీవనోపాధి కల్పించి, బంగారం పండించిన తమ స్వంత భూములను పరాయి వ్యక్తులకు అప్పగించి, వేరొకరి కింద కూలీలుగా ఆత్మవంచనతో మౌనంగా రోదిస్తున్న ఆ రైతుల పరిస్థితిని స్వయం సంవృద్ది అందామా???
బారతదేశ ఆర్ధికాభివృద్ధికి భారీపరిశ్రమలుస్థాపించడం,మౌళిక సదుపాయాలు మెరుగు పరచుకోవడం ఎంత అవసరమో... బారతదేశ ప్రజల ఆహారభద్రతకు..వ్యవసాయభూములను, రైతుల ప్రయోజనాలను కాపాడటం కూడా అంతే అవసరం. ఇటీవల ప్రభుత్వ అంచనా ప్రకారం మన రాష్ట్రంలో అయిదు లక్షల హెక్టార్ల సస్యశ్యామలమైన భూములు పంటకు నోచుకోక బీళ్ళు అయిపోయాయి. పంటలు పండించకపోతే ప్రజలకు ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండవన్న విషయం ఈ ప్రభుత్వాలకు తెలియదా? ప్రత్యేక ఆర్ధికమండళ్ళు ( SEZ ), భారీ పరిశ్రమల పేరుతో రైతులకు నోటీసులు ఇచ్చి,బెదిరించి,మాయ చేసి కాళ్ళ కింద ఉన్న నేలను లాగేసుకొని, పది మందికి అన్నం పెట్టె రైతుల పొట్ట కొట్టటమే ఈ ప్రభుత్వం లక్ష్యమా ? పరిశ్రమలు స్థాపిస్తామంటూ రైతుల నుండి భూములను వేల రూపాయలకు కొని దానినే తిరిగి కోట్లకు అమ్ముకుంటూ REAL ఎస్టేట్ వ్యాపారం చేయడం నిజం కాదా? ఈ నిజాన్ని(REAL) అభివృద్ధి అందామా???
Adam smith తన Wealth of Nations (1776) అనే గ్రంధము లో “The Government of an exclusive company of merchants is, perhaps, the worst of all governments for any country whatever.” అని చెప్పారు. అధికారం అండతో తమ స్వంత వ్యాపారాలను విస్తరించుకోనే Crony capitalism ఇప్పుడు ప్రమాదకరంగా ప్రబలుతోంది అని మన ప్రధానమంత్రి మన్మోహన్ గారు విలేకరుల సమావేశంలో (Sept 6th , 2010) సెలవిచ్చారు. పంటపొలాలను పరిశ్రమలకు కేటాయించవద్దని చట్టాలు చెబుతున్నా తమ అధికారాన్ని ఉపయోగించుకుని సారవంతమైన భూములను పరిశ్రమల పేరుతో తమ కుటుంబ సంస్థలకు అప్పగించడం Crony capitalism కాదా? విదేశీకంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాము, వస్తుసేవల రంగాలలో, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాము, బుల్ కుమ్మేస్తుంది, సెన్సెక్స్ 19,000 దాటింది, GDP పెరిగింది అని గొప్పలు చెప్పుకుంటున్న మన పాలకులకు రోజూ వందల మంది రైతులు మరణిస్తున్న సంగతి తెలియదా? DIL , Sricity , Fabcity ,Emmar ల పేరుతో రైతులకు జీవనోపాధి కల్పించే పచ్చని పంటపొలాలను వదలకుండా కొల్లగొట్టి వారిని బిచ్చగాళ్ళుగా మారుస్తున్న ఈ పరిస్థితిని... India shining అందామా???
పౌర హక్కుగా ఉన్న ఆస్తి హక్కు ఎప్పుడైతే రాజ్యంగ హక్కుగా మారిందో... అప్పటినుండి ప్రభుత్వానికి, ప్రైవేటు ఆస్తులను ప్రజల ఉపయోగాల కోసం సేకరించే హక్కు (విధానాలతో కూడిన) కలిగింది. చట్టం నిర్దేశించిన విధివిధానాలు, షరతులు పాటించకుండా ప్రభుత్వంలో పెద్దలు దురుద్దేశంతో, ప్రజాప్రయోజనాలను పక్కదారి పట్టిస్తూ ..సమాజంలో అందరికి చెందవలసిన సహజ వనరులను తమ అధికారంతో కొందరే దక్కించుకోవటం మనం ప్రతిరోజు పత్రికలలో చదువుతున్నాము. ప్రస్తుతం కాల పరిస్థితుల ప్రకారం ప్రజలు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్ధి చెందాలంటే... తమ ఉమ్మడి ఆస్తి వనరు అయినటువంటి భూమిపై న్యాయపరమైన అధికారం కోరడం అనేది ఆమోదయోగ్యమైన హక్కు, కాబట్టి ఆస్తిహక్కును కొన్ని విధివిధానాలతో పౌర హక్కుగా మార్చాలని నా అభిప్రాయం. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యతులో అభివృద్ధి చేస్తామంటూ నీరు, గాలి కూడా కొందరి సొత్తు అవుతాయేమో. కనుక దేశమంటే నరులు మాత్రమే కాదు ... ఏ ఒక్కరి ఆధిపత్యం లేని ఉమ్మడి వనరులు కూడా అయితే బాగుంటుంది కదా ...
మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com