Showing posts with label Koodali. Show all posts
Showing posts with label Koodali. Show all posts

Thursday, September 16, 2010

Land – The Common Property Resource


రాష్ట్రం అంటే మనుషులు మాత్రమే కాదు , రాష్ట్రం అంటే మట్టి కూడ.. గురజాడ గారు దేశమంటే మనుషులు అని ఉదాహరించినా, వాస్తవ పరిస్థితులలో మన రాష్ట్రం పరిస్థితి చూస్తే మట్టి కూడ అని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే రాష్ట్రం అనగా అడవులు,కొండలు, గనులు, పంట పొలాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఖరీదైన వ్యాపార భవన సముదాయాలు, రింగు రోడ్లు, SEZ లు , టెక్నాలజి పార్కులు .. ఇవే అనే  అభిప్రాయం మన పాలక వర్గానికి వచ్చిన తర్వాత .. రాష్ట్రం అంటే మనుషులు అనే భావం ఎప్పుడో   పోయింది. భూమికి , మనుషులకి మధ్య  అభివృద్ధి పేరుతో కార్పోరేట్ కారిడార్లు తెరుచుకున్న తర్వాత  మట్టికి మనిషికి మధ్య ఉన్న జీవాత్మక అనుభందంతో పాటు వ్యాపారత్మక అనుభందం బలపడింది. గ్యాసు పైపులైన్లు, పోర్టులతో, పవర్ ప్రాజక్టుల పేరుతో  భూమి  అంతా ప్రజలనుండి కొన్ని కుటుంబ సంస్థల చేతులలోకి మారిన తర్వాత... ఇంకెక్కడి అభివృద్ధి , ఇంకెక్కడి శాంతి సౌభాగ్యాలు ..నిత్యం ఉద్యమాలు, కాల్పులు ,మరణాలు తప్ప

ప్రత్యేక ఆర్ధికమండళ్ళు ( SEZ) ,భారీ పరిశ్రమలు, అభివృది పనుల పేరుతో మన ప్రభుత్వం లక్షల ఎకరాల భూమి సేకరిస్తూ ఉంది. ఇందులో ఎక్కువ భాగం రైతుల నుండి సేకరించినవే.. అందులో కూడా భూములు పోగొట్టుకున్న రైతులు ఎక్కువమంది రెండు..మూడు ఎకరాలు సాగు చేసుకొని జీవించే పేద  రైతులే. మన ప్రభుత్వం సెజ్ లు మరియు భారీ పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్నపుడు, ఆ భూములు పోగొట్టుకున్న రైతులకు ప్రత్యామ్నాయంగా ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాని కొన్నిచోట్ల అయిదు సంవస్తరాలు అయిన పరిశ్రమల ఏర్పాటు ఇంకా జరుగ లేదు.  ఇప్పుడు ఆ రైతులకు ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ జరింగిందని చెప్పవచ్చు.  సాగుచేసుకునే అవకాశం లేక, ఇంకా  ప్రారంభించని ఆ పరిశ్రమలలో ఉపాధి దొరకక, పట్టణాలకు వలసలు వెళుతున్నారు. రెక్కల కష్టం, వ్యవసాయం తప్ప మరే ఇతర వృత్తి నైపుణ్యం లేని, పెద్ద చదువులు చదవని ఈ రైతులు..వారి పొలాలలో స్థాపించబోయే  పరిశ్రమలలో మరి  టాయిలెట్లు కడగాలా? రోడ్లు ఊడ్చాలా? కార్లు తుడవాల?  తరతరాలుగా జీవనోపాధి కల్పించి, బంగారం పండించిన తమ స్వంత భూములను  పరాయి వ్యక్తులకు అప్పగించి, వేరొకరి కింద కూలీలుగా ఆత్మవంచనతో మౌనంగా రోదిస్తున్న ఆ రైతుల పరిస్థితిని స్వయం సంవృద్ది అందామా???

బారతదేశ ఆర్ధికాభివృద్ధికి భారీపరిశ్రమలుస్థాపించడం,మౌళిక సదుపాయాలు మెరుగు పరచుకోవడం ఎంత అవసరమో... బారతదేశ ప్రజల ఆహారభద్రతకు..వ్యవసాయభూములను, రైతుల ప్రయోజనాలను కాపాడటం కూడా అంతే అవసరం. ఇటీవల ప్రభుత్వ అంచనా ప్రకారం మన రాష్ట్రంలో అయిదు లక్షల హెక్టార్ల సస్యశ్యామలమైన భూములు పంటకు నోచుకోక బీళ్ళు అయిపోయాయి. పంటలు పండించకపోతే ప్రజలకు ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు  అందుబాటులో ఉండవన్న విషయం ఈ ప్రభుత్వాలకు తెలియదా? ప్రత్యేక ఆర్ధికమండళ్ళు ( SEZ ), భారీ పరిశ్రమల పేరుతో రైతులకు నోటీసులు ఇచ్చి,బెదిరించి,మాయ చేసి కాళ్ళ కింద ఉన్న నేలను లాగేసుకొని, పది మందికి అన్నం పెట్టె  రైతుల పొట్ట కొట్టటమే ఈ ప్రభుత్వం లక్ష్యమా ? పరిశ్రమలు స్థాపిస్తామంటూ రైతుల నుండి భూములను వేల రూపాయలకు కొని దానినే తిరిగి కోట్లకు అమ్ముకుంటూ REAL ఎస్టేట్ వ్యాపారం చేయడం నిజం కాదా? ఈ నిజాన్ని(REAL) అభివృద్ధి అందామా???

Adam smith తన Wealth of Nations (1776) అనే గ్రంధము లో  “The Government of an exclusive company of merchants is, perhaps, the worst of all governments for any country whatever.” అని చెప్పారు.  అధికారం అండతో తమ స్వంత వ్యాపారాలను విస్తరించుకోనే Crony capitalism  ఇప్పుడు ప్రమాదకరంగా ప్రబలుతోంది  అని మన ప్రధానమంత్రి  మన్మోహన్ గారు విలేకరుల సమావేశంలో (Sept 6th , 2010) సెలవిచ్చారు. పంటపొలాలను పరిశ్రమలకు కేటాయించవద్దని చట్టాలు చెబుతున్నా తమ అధికారాన్ని ఉపయోగించుకుని సారవంతమైన భూములను పరిశ్రమల పేరుతో తమ కుటుంబ సంస్థలకు అప్పగించడం Crony capitalism కాదా? విదేశీకంపెనీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాము, వస్తుసేవల రంగాలలో, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాము, బుల్ కుమ్మేస్తుంది, సెన్సెక్స్ 19,000 దాటింది, GDP పెరిగింది అని గొప్పలు చెప్పుకుంటున్న మన పాలకులకు రోజూ వందల మంది రైతులు మరణిస్తున్న సంగతి తెలియదా? DIL , Sricity , Fabcity ,Emmar ల పేరుతో రైతులకు జీవనోపాధి కల్పించే పచ్చని పంటపొలాలను వదలకుండా కొల్లగొట్టి వారిని బిచ్చగాళ్ళుగా మారుస్తున్న ఈ పరిస్థితిని... India shining అందామా???
పౌర హక్కుగా ఉన్న ఆస్తి హక్కు ఎప్పుడైతే రాజ్యంగ హక్కుగా మారిందో... అప్పటినుండి ప్రభుత్వానికిప్రైవేటు ఆస్తులను ప్రజల ఉపయోగాల కోసం సేకరించే హక్కు (విధానాలతో కూడిన) కలిగింది. చట్టం నిర్దేశించిన విధివిధానాలు, షరతులు పాటించకుండా ప్రభుత్వంలో పెద్దలు దురుద్దేశంతో, ప్రజాప్రయోజనాలను పక్కదారి పట్టిస్తూ ..సమాజంలో అందరికి చెందవలసిన సహజ వనరులను తమ అధికారంతో కొందరే దక్కించుకోవటం మనం ప్రతిరోజు పత్రికలలో చదువుతున్నాము. ప్రస్తుతం కాల పరిస్థితుల ప్రకారం ప్రజలు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్ధి చెందాలంటే... తమ ఉమ్మడి ఆస్తి వనరు అయినటువంటి భూమిపై న్యాయపరమైన అధికారం కోరడం అనేది ఆమోదయోగ్యమైన హక్కు, కాబట్టి ఆస్తిహక్కును కొన్ని విధివిధానాలతో పౌర హక్కుగా మార్చాలని నా అభిప్రాయం. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యతులో అభివృద్ధి  చేస్తామంటూ నీరు, గాలి కూడా కొందరి సొత్తు అవుతాయేమో. కనుక దేశమంటే నరులు మాత్రమే కాదు ... ఏ ఒక్కరి ఆధిపత్యం లేని ఉమ్మడి వనరులు కూడా అయితే బాగుంటుంది కదా ...
మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com


Thursday, July 15, 2010

Farm fields are war fields @ andhrapradesh,Inc.gov



రైతులకు భూమి  ఉండడం నేరమా? రైతులు భూమిని దున్నడం చట్ట వ్యతిరేకమా? మరెందుకు.. జూలై 14 , 2010 న శ్రీకాకుళం జిల్లాలోని  సోంపేట రుధిర క్షేత్రంగా మారింది?  3000 మంది పోలీసులు మరియు 200 మంది ప్రవేట్ సైన్యం అందరు కలసి పచ్చని పంటచేల పైకి, కష్టం చేసుకొని కల్మషం తెలియని కర్షకులపైకి, బడుగు జీవుల పైకి వేటకు వెళ్లి...పది మందికి అన్నం పెట్టె రైతులను ఎందుకు కాల్చి చంపాలి. ఆకుపచ్చని పంట భూములను బూడిద చేయబోతున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా న్యాయబద్దంగా  ఉద్యమం చేస్తున్న వారిపై ఆటవికంగా బుల్లెట్లు కురిపించడం ఎంతవరకు సమంజసం. ఆందోళన కారులు శాంతియుతంగా  పోలీసులకు చేతులెత్తి మొక్కారు, కొంతమంది మహిళలు ప్లాంటు వద్దంటూ పోలీసుల పాదాలను తాకి వేడుకున్నారు, ప్రజల వ్యతిరేకతను అర్థం చేసుకోలేని పోలీసులు అసహనంతో నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపి పేద రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారు. సున్నితమైన సమస్యలను బలప్రయోగంతో పరిష్కరించాలనుకొనే ఈ  చర్య, ప్రభుత్వ  వైఫల్యం కాదా?

ప్రకృతి సంపదను, గ్రామాలను.. కంపెనీలకు అమ్మేసి , వాటిలో విద్యుత్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, సెజ్ లను చూపించి, అభివృద్ధి అని నమ్మించి ప్రజలను బిక్షగాండ్లను చేయడమెందుకు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల వలన మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ దీపాల కాంతితో, నిరంతరం నడిచే పరిశ్రమలతో వెలిగిపోతుందనుకొంటే అది అమాయకత్వమే అవుతుంది. ఇవన్ని వాణిజ్య ప్రాతిపదిక మీద ఏర్పాటుకాబోతున్న ప్రాజెక్టులే కాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పనిసరిగా విద్యుత్ సరఫరా చెయ్యాలనే నిభంధన అంటూ ఏమి లేదు. మన రాష్ట్రం చిమ్మ చీకట్లో మగ్గిపోతున్నా ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు తమకు తోచిన విధంగా ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు, సంస్థలకు అమ్ముకునే అవకాశం ఉంది . మరి అటువంటప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని  గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ  భూములను, బ్రతుకులను  ఎందుకు త్యాగం చెయ్యాలి మరి ఎవరి జీవితాలలొనూ  వెలుగులు నింపని ఈ ప్రాజెక్టులకోసం.

శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం లోని 24   గ్రామాలలో  లక్ష ఎకరాలలో వ్యవసాయం  మరియు వ్యవసాయ అనుభంద వృత్తులపై  ప్రజలు ఆధారపడి  ఉన్నారు. అలాగే అక్కడున్న జల వనరులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు కూడా ఉన్నారు. వీరికి సంబందించిన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని ప్రవేట్ కంపెనీలకు ప్రాజెక్టుల కోసం కేటాయిస్తే, జీవనోపాధి కోల్పోతామన్న భయంతో సహజంగానే వ్యతిరేకత వస్తుంది. అంతే కాకుండా ఈ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన నీరు చుట్టుపక్కల ఉన్న చెరువులు, సరస్సుల నుండి పెద్ద మొత్తంలో వాడుకోవడం వలన తాగడానికి , సాగు చేయడానికి  నీరు కొరత ఏర్పడుతుందని స్థానికులలో భయం ఉంది.  థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు వాడే బొగ్గు నుండి కొన్ని కోట్ల టన్నుల బూడిద (carbon emissions) వచ్చి పర్యావరణానికి, వ్యవసాయ భూములకు, ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం కలిగే అవకాసం ఉంది. ఇన్ని భయాందోళనలు  ప్రజలలో ఉన్నందున, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు సుమారు 230  రోజుల నుండి శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.

బారత దేశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించాల్సిందే, మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకోవాల్సిందే కాని ఆహారభద్రత కల్పించే భారతీయ రైతుల, ఇతర అనుభంధ వృత్తుల ప్రజల జీవనోపాది కోల్పోయే విధంగా మాత్రం కాదు. ప్రాజెక్టులు కాని, SEZ లు కాని నిర్మించాలుచుకున్నపుడు, వ్యవసాయానికి పనికిరాని భూములను ఎంచుకోవచ్చు, ఒకవేళ తప్పనిసరిగా వ్యవసాయ భూములు అవసరం అయినప్పుడు తగిన పారితోషికం ఇవ్వటం ద్వారనో , భూమికి బదులుగా మరొక భూమిని సమకూర్చటం ద్వారానో నిరాశ్రయులు అయినవారిని ఆదుకోవచ్చు, ప్రాజెక్టుల ఉపయోగాన్ని  వివరించి ,ప్రజల అపోహలు తొలగించి, ఉద్రిక్తత నివారించే చర్యలు చేపట్టవచ్చు. అలాకాకుండా ఇటువంటి సున్నితమైన సమస్యలను బలప్రయోగం ద్వార పరిష్కరించాలనుకొంటే " వ్యవసాయ భూములన్ని ... యుద్ధ భూములుగా" మారగలవు.
మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com
Pic Courtesy: Eenadu News

Friday, June 18, 2010

Bhopal gas leak disaster is a lesson

భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆక్రోశంతో నినదిస్తున్న  ఆ భాధితురాలు  ఆవేదనకు భారత ప్రభుత్వం కాని భారతీయ న్యాయవ్యవస్థ  కాని పూర్తి పరిష్కారం చూపలేక పొయింది. కసభ్ ఉరిశిక్ష విషయమై, సామాన్యునికి న్యాయవ్యవస్థపై నమ్మకం కల్పించాలంటూ  ప్రగల్భాలు పలికిన మన న్యాయవ్యవస్థ, అతి  ఘోరమైన పారిశ్రామిక విపత్తు భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై 26 ఏళ్ళ సుదీర్గ వాదోపవాదాల అనంతరం జూన్ 7 న తన 95 పేజీల తీర్పులో దోషులకు కేవలం 2  సంవస్తరాల జైలు శిక్ష ను మరియు కొద్దిమొత్తంలో జరిమానా (2,123 U.S. dollars) విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే దోషులకు బెయిలు కూడా మంజూరు చేసింది. దోషులు వృద్ధులయ్యారు….. వీరిని కఠినంగా శిక్షించలేం అంటూ న్యాయస్థానం సానుభూతి ప్రదర్శించింది. పైగా ఈ తీర్పులో ఘోరానికి భాధ్యులైన అప్పటి యూనియన్ కార్బైడ్ CEO ఆండెర్సన్ పేరు ప్రస్తావిన్చకపోవటం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఈ తీర్పు ద్వారా సగటు భారతీయునికి  తన న్యాయ వ్యవస్థ పై, ప్రభుత్వ పనితీరుపై అపనమ్మకం ఏర్పడింది.

1984 డిసెంబర్ 3 న  యూనియన్ కార్బైడ్ ఫాక్టరీ భధ్రతా ప్రమాణాల లోపం వలన  మిథయిల్  ఐసోసయనట్ విషవాయువు  లీక్ అయి  దాదాపు 20 వేల మంది మృతి చెందగా, 5 లక్షల మంది తీవ్ర అనారోగ్యంపాలయ్యారు, మరియు ముందు తరాల వారు కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో భాధ పడుతున్నారు. 1985 ఫిబ్రవరి లో అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ అండర్సన్ ను అరెస్టు చేసి,అతను అమెరికా వెళ్లి తిరిగి భారతదేశానికి వస్తానంటూ ఇచ్చిన హామీతో బెయిలుపై విడుదల చేసారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం, 330  కోట్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేస్తే, అమెరికా కోర్టు ఆ కేసులన్నింటిని మీరే పరిష్కరించుకోవాలంటూ భారత దేశానికీ బదలాయించింది. అమెరికా కోర్టు కాదన్నపుడు, ఐక్యరాజ్యసమితి  పరిధిలోని  అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లకపోవడం మన ప్రభుత్వము మరియు న్యాయవ్యవస్థల వైఫల్యంగా చెప్పవచ్చు. 1989  లో కోర్టు వెలుపల ఒప్పందం క్రింద యూనియన్ కార్బైడ్, 470  మిలియన్ల డాలర్లు  అంటే సుమారు 1700 కోట్ల రూపాయలు  భారత ప్రభుత్వానికి చెల్లించింది. 330 కోట్ల డాలర్ల భారత ప్రభుత్వ నష్ట పరిహార అభ్యర్ధనను, యూనియన్ కార్బైడ్ 47 కోట్ల డాలర్లు మాత్రమే చెల్లించడంలో మన ప్రభుత్వం బేరసారాలు సాగించడంలో విఫలమైనదని తెలుస్తుంది. ఎప్పుడో 1989 లోనే 1700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లభిస్తే …… 2004 జూలై 19 న సుప్రీం కోర్టు ప్రభుత్వానికి  చీవాట్లు పెట్టేదాకా భాధితులకు నష్ట పరిహారం సక్రమంగా  చెల్లించలేదంటే మన ప్రభుత్వం ఎంత ఉదాసినతతో వ్యవహరించిందో వేరుగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి నష్టపరిహారం అందని భాధితులు ఉన్నారన్నది వాస్తవం.



ఇటీవల  అమెరికా గల్ఫ్ అఫ్ మెక్సికోలో జరుగుతున్న BP oil-spill  పరిష్కారం విషయంలో.. BP   కంపెనీకి మరియు అమెరికా ప్రభుత్వానికి మధ్య జరిగిన మొదటి పరిష్కార ఒప్పందంలో (జూన్ 16, 2010), BP Oil కంపెనీ 20  బిలియన్ల డాలర్లు  మొత్తం చెల్లింపుకు అంగీకారం తెలిపింది. ఆదే అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకున్న పౌర వినియోగ అణు ఒప్పందం(2005)  ప్రకారం, మన దేశంలో స్థాపించబోయే అమెరికా అణు విద్యుత్ సంస్థలలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే నష్ట పరిహారం 500  కోట్ల రూపాయలు మించి చెల్లించబోమని పరిమితులతో కూడిన షరతులు విధించింది. అందుకు అంగీకరించిన మన ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది.(బిల్లు పాస్ కాలేదు - ఇది చాలా చిన్నమొత్తం అయినందున, ప్రతిపక్షాలు అంగీకారం తెలుపలేదు). ఎంతో గొప్ప అయినటువంటి Oxford University లో చదువుకున్న, ఎంతో విజ్ఞానం, వికాసం ఉన్న మన ప్రధానమంత్రి గారు బహుళ జాతి సంస్థల ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత దేశం ప్రజల ప్రాణాలను 500 కోట్ల రూపాయలకు పరిమితి విధించి పణంగా పెట్టదల్చుకున్నారు. మరి ఈ ప్రభుత్వాధినేతలు,మన ప్రజల ప్రాణాలను...భారత దేశ సార్వభౌమత్వాన్నిఏ విధంగా కాపాడుతారు.


అందుకే మనలను మనం చక్కదిద్దుకోవాలి, మన న్యాయవ్యవస్థలోను, మన ప్రభుత్వ పనితీరులోను సంస్కరణలు,సవరణలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణ నేపధ్యంలో, బహుళజాతి సంస్థలతో జరిగే ఒప్పందాలలో ప్రజల భద్రతను, పర్యావరణాన్ని ప్రధానఅంశంగా చేర్చాలి. ఆర్ధిక సరళీకృత విధానాల వలన ధనిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై అధికారం చెలాయించే  అవకాశం ఉన్నందున.. మన దేశ ఆత్మ గౌరవాన్ని , సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా ఉండకూడదు. మన భారత దేశ పరిశ్రమల భధ్రత కోసం అత్యున్నత ప్రమాణాలతో పటిష్టమైన చట్టం రూపొందించు కోవలసిన అవసరం ఉంది . ఇకపై ఎటువంటి విపత్తులు జరుగకుండా ఉండడానికి భోపాల్ దుర్ఘటన మనకు ఒక గుణపాఠం కావాలి.

మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com

Friday, April 16, 2010

Operation People Hunt

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలో ఏప్రిల్ 6వ తేదిన 76 మంది CRPF జవాన్లను మావోయిస్టులు హతమార్చడం మన అందరికి తెలిసిందే. భారతదేశ చరిత్రలో ఇంత దారుణమైన మారణకాండ జవాన్ల పై ఎన్నడు జరుగలేదు. ఈ దారుణాన్ని మనమంతా ఖండించాల్సిన విషయం, ఇది చాలా హేయమైన చర్య, ప్రజాస్వామ్యంలో హింసకు ఆమోదం లేదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలని గమనిస్తే విస్తుపోక తప్పదు.

మొదటిది, కేంద్ర హోంశాఖ కార్యదర్శి G K పిళ్ళై తీవ్ర స్వరంతో " మా సత్తా ఏమిటో చూపిస్తాం" అంటూ ప్రతీకార ధోరణిలో మాట్లాడారు, దానిని చిదంబరం కూడా సమర్దించారు. (Please Refer Eenadu Archives)
ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి, విపత్కర పరిస్థితులలో statements ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. వారు వాడిన ప్రతీకార భాష అగ్గికి ఆజ్యం పోసినట్లుందే తప్ప.... స్వాంతన కాని, ఆలోచనధోరణని మార్చే దిశగా లేదు. నిజం చెప్పాలంటే వారి మాటలు CRPF జవాన్లకు ధైర్యం కల్పించే విధం గాను, చనిపోయినవారి కుటుంబాలకు ఓదార్పుగాను, మావోయిస్టులను ప్రజలందరి ముందు దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం జరగాలే తప్ప , ప్రతీకార భాష తో మావోయిస్టులను మరిన్ని దాడులకు ఉసిగొల్పే విధంగా, CRPF జవాన్లలో ప్రతీకారాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు.
రెండవది, చిదంబరం రాజీనామా నాటకం, దానిని ప్రధానమంత్రి ఆమోదించక పోవడం. 76 మంది జవాన్ల మరణానికి తానే భాద్యుడంటూ... గొప్ప మానవత్వాన్ని, నైతిక భాద్యతను చాటుకునే ప్రయత్నాన్నిరాజీనామా ద్వారా చేసారు. మరి డిసెంబర్ 2009 నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయమై... అస్పష్టమైన, అర్ధం చేసుకోవటానికి కష్టమైన, ద్వందర్దాలు కలిగిన statements ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 200 మందికి పైగా మరణాలకు ( ప్రత్యేక, ఉమ్మడి రాష్ట్రంకోసం ఆత్మహత్యలు) కారణమైన ఈ చిదంబరానికి అప్పుడెందుకు ఈ రాజీనామాలు , ఈ నైతిక భాద్యతలు గుర్తుకు రాలేదో ఆ చిదంబర రహస్యాన్ని ..చిదంబరం గారే చెప్పాలి.


అయితే చిదంబరం, 2003 వరకు Vedanta resources (British based multinational)  కంపెనీ లో డైరెక్టర్ గాను, ఆ కంపెనీ న్యాయవాది గాను పనిచేసిన విషయం ప్రజలందరికి తెలిసిందే Chidambaram -Wikipedia. ఛత్తీస్గఢ్ లోను, ఒరిస్సాలోను విస్తారమైన అటవీప్రాంతంలోగల అపారమైన ఖనిజ సంపదను అతి పెద్ద కార్పోరేట్ సంస్థలైన TATA , ESSAR , Vedanta resources లకు కేటాయించడం, దానివలన కొంతమంది ఆదివాసిలు నిరాశ్రయులుగా మారడం, వారికి మావోయిస్టులు మద్దతు తెలియజేయడం.. వాటి పరిణామాలు. కార్పోరేట్ సంస్థలను పరిరక్షించే నిమిత్తం, ప్రభుత్వం శాంతిభద్రత మరియు తీవ్రవాద నిర్మూలన సాకుతో మావోయిస్టుల పై అప్రకటిత యుద్ధం (Operation Green Hunt) ప్రారంబించడం ... ఆ తర్వాత ఈ మారణహోమం దాని పర్యవసానమే. మావోయిస్టులు మాత్రం తాము ఎప్పటికైనా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి సామ్యవాద సమసమాజ సామ్రజ్యాన్ని స్తాపించాలనే భ్రమతో… హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మావోయిస్టుల చర్యలతో ప్రజలు ఎప్పుడో విసిగిపోయారు, ఇంకా కొన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు అంటే... అది ప్రేమతో, అభిమానంతో మాత్రం కానే కాదు, కేవలం భయంతోనే.


ఒక విధంగా చెప్పాలంటే .. మనకు, పాకిస్తాన్ కు ఈ అంతర్యుద్ధ విషయంలో కొంచెం సారుప్యత కనిపిస్తుంది. పాకిస్తాన్ తీవ్రవాదం అణచివేత పేరుతో అమెరికాసేనల మద్దతుతో గిరిజనులపై పోరాటం చేస్తుంటే , మనము బహుళజాతి కంపెనీల సంరక్షణ కోసం శాంతిభద్రతల పేరుతో, అభివృద్ధి పేరుతో మావోయిస్టులపై , ఆదివాసిలపై యుద్ధం చేస్తున్నాము. అభివృద్ధి తో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. ఏది ఏమైనప్పటికీ... ప్రభుత్వ విధానాల ద్వారా చనిపోతుంది మనుషులే కాని క్రూరమృగాలు కాదు, వారు CRPF జవాన్లు అయిన, ఇంఫార్మర్స్ నెపంతో గిరిజనులు అయిన, మావోయిస్టుల అయిన ...అందరు భారతీయులే కాని చొరబాటుదారులు కారు, పరజాతీయులు కారు. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం రాజీనామాకు ఉపక్రమించడం , హోంశాఖ కార్యదర్శి ప్రతీకారంతో రగిలిపోవడం లాంటి ఈ పరిస్థితులలో ప్రభుత్వం అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని ఈ సమస్య కు పరిష్కారం కనుక్కోగలదని ఆశిద్దాం.
మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com
´