భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆక్రోశంతో నినదిస్తున్న ఆ భాధితురాలు ఆవేదనకు భారత ప్రభుత్వం కాని భారతీయ న్యాయవ్యవస్థ కాని పూర్తి పరిష్కారం చూపలేక పొయింది. కసభ్ ఉరిశిక్ష విషయమై, సామాన్యునికి న్యాయవ్యవస్థపై నమ్మకం కల్పించాలంటూ ప్రగల్భాలు పలికిన మన న్యాయవ్యవస్థ, అతి ఘోరమైన పారిశ్రామిక విపత్తు భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై 26 ఏళ్ళ సుదీర్గ వాదోపవాదాల అనంతరం జూన్ 7 న తన 95 పేజీల తీర్పులో దోషులకు కేవలం 2 సంవస్తరాల జైలు శిక్ష ను మరియు కొద్దిమొత్తంలో జరిమానా (2,123 U.S. dollars) విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే దోషులకు బెయిలు కూడా మంజూరు చేసింది. దోషులు వృద్ధులయ్యారు….. వీరిని కఠినంగా శిక్షించలేం అంటూ న్యాయస్థానం సానుభూతి ప్రదర్శించింది. పైగా ఈ తీర్పులో ఘోరానికి భాధ్యులైన అప్పటి యూనియన్ కార్బైడ్ CEO ఆండెర్సన్ పేరు ప్రస్తావిన్చకపోవటం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఈ తీర్పు ద్వారా సగటు భారతీయునికి తన న్యాయ వ్యవస్థ పై, ప్రభుత్వ పనితీరుపై అపనమ్మకం ఏర్పడింది.
1984 డిసెంబర్ 3 న యూనియన్ కార్బైడ్ ఫాక్టరీ భధ్రతా ప్రమాణాల లోపం వలన మిథయిల్ ఐసోసయనట్ విషవాయువు లీక్ అయి దాదాపు 20 వేల మంది మృతి చెందగా, 5 లక్షల మంది తీవ్ర అనారోగ్యంపాలయ్యారు, మరియు ముందు తరాల వారు కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో భాధ పడుతున్నారు. 1985 ఫిబ్రవరి లో అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ అండర్సన్ ను అరెస్టు చేసి,అతను అమెరికా వెళ్లి తిరిగి భారతదేశానికి వస్తానంటూ ఇచ్చిన హామీతో బెయిలుపై విడుదల చేసారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం, 330 కోట్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేస్తే, అమెరికా కోర్టు ఆ కేసులన్నింటిని మీరే పరిష్కరించుకోవాలంటూ భారత దేశానికీ బదలాయించింది. అమెరికా కోర్టు కాదన్నపుడు, ఐక్యరాజ్యసమితి పరిధిలోని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లకపోవడం మన ప్రభుత్వము మరియు న్యాయవ్యవస్థల వైఫల్యంగా చెప్పవచ్చు. 1989 లో కోర్టు వెలుపల ఒప్పందం క్రింద యూనియన్ కార్బైడ్, 470 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 1700 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి చెల్లించింది. 330 కోట్ల డాలర్ల భారత ప్రభుత్వ నష్ట పరిహార అభ్యర్ధనను, యూనియన్ కార్బైడ్ 47 కోట్ల డాలర్లు మాత్రమే చెల్లించడంలో మన ప్రభుత్వం బేరసారాలు సాగించడంలో విఫలమైనదని తెలుస్తుంది. ఎప్పుడో 1989 లోనే 1700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లభిస్తే …… 2004 జూలై 19 న సుప్రీం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టేదాకా భాధితులకు నష్ట పరిహారం సక్రమంగా చెల్లించలేదంటే మన ప్రభుత్వం ఎంత ఉదాసినతతో వ్యవహరించిందో వేరుగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి నష్టపరిహారం అందని భాధితులు ఉన్నారన్నది వాస్తవం.
ఇటీవల అమెరికా గల్ఫ్ అఫ్ మెక్సికోలో జరుగుతున్న BP oil-spill పరిష్కారం విషయంలో.. BP కంపెనీకి మరియు అమెరికా ప్రభుత్వానికి మధ్య జరిగిన మొదటి పరిష్కార ఒప్పందంలో (జూన్ 16, 2010), BP Oil కంపెనీ 20 బిలియన్ల డాలర్లు మొత్తం చెల్లింపుకు అంగీకారం తెలిపింది. ఆదే అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకున్న పౌర వినియోగ అణు ఒప్పందం(2005) ప్రకారం, మన దేశంలో స్థాపించబోయే అమెరికా అణు విద్యుత్ సంస్థలలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే నష్ట పరిహారం 500 కోట్ల రూపాయలు మించి చెల్లించబోమని పరిమితులతో కూడిన షరతులు విధించింది. అందుకు అంగీకరించిన మన ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది.(బిల్లు పాస్ కాలేదు - ఇది చాలా చిన్నమొత్తం అయినందున, ప్రతిపక్షాలు అంగీకారం తెలుపలేదు). ఎంతో గొప్ప అయినటువంటి Oxford University లో చదువుకున్న, ఎంతో విజ్ఞానం, వికాసం ఉన్న మన ప్రధానమంత్రి గారు బహుళ జాతి సంస్థల ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత దేశం ప్రజల ప్రాణాలను 500 కోట్ల రూపాయలకు పరిమితి విధించి పణంగా పెట్టదల్చుకున్నారు. మరి ఈ ప్రభుత్వాధినేతలు,మన ప్రజల ప్రాణాలను...భారత దేశ సార్వభౌమత్వాన్నిఏ విధంగా కాపాడుతారు.
అందుకే మనలను మనం చక్కదిద్దుకోవాలి, మన న్యాయవ్యవస్థలోను, మన ప్రభుత్వ పనితీరులోను సంస్కరణలు,సవరణలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణ నేపధ్యంలో, బహుళజాతి సంస్థలతో జరిగే ఒప్పందాలలో ప్రజల భద్రతను, పర్యావరణాన్ని ప్రధానఅంశంగా చేర్చాలి. ఆర్ధిక సరళీకృత విధానాల వలన ధనిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై అధికారం చెలాయించే అవకాశం ఉన్నందున.. మన దేశ ఆత్మ గౌరవాన్ని , సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా ఉండకూడదు. మన భారత దేశ పరిశ్రమల భధ్రత కోసం అత్యున్నత ప్రమాణాలతో పటిష్టమైన చట్టం రూపొందించు కోవలసిన అవసరం ఉంది . ఇకపై ఎటువంటి విపత్తులు జరుగకుండా ఉండడానికి భోపాల్ దుర్ఘటన మనకు ఒక గుణపాఠం కావాలి.
మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com