Thursday, July 15, 2010

Farm fields are war fields @ andhrapradesh,Inc.gov



రైతులకు భూమి  ఉండడం నేరమా? రైతులు భూమిని దున్నడం చట్ట వ్యతిరేకమా? మరెందుకు.. జూలై 14 , 2010 న శ్రీకాకుళం జిల్లాలోని  సోంపేట రుధిర క్షేత్రంగా మారింది?  3000 మంది పోలీసులు మరియు 200 మంది ప్రవేట్ సైన్యం అందరు కలసి పచ్చని పంటచేల పైకి, కష్టం చేసుకొని కల్మషం తెలియని కర్షకులపైకి, బడుగు జీవుల పైకి వేటకు వెళ్లి...పది మందికి అన్నం పెట్టె రైతులను ఎందుకు కాల్చి చంపాలి. ఆకుపచ్చని పంట భూములను బూడిద చేయబోతున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా న్యాయబద్దంగా  ఉద్యమం చేస్తున్న వారిపై ఆటవికంగా బుల్లెట్లు కురిపించడం ఎంతవరకు సమంజసం. ఆందోళన కారులు శాంతియుతంగా  పోలీసులకు చేతులెత్తి మొక్కారు, కొంతమంది మహిళలు ప్లాంటు వద్దంటూ పోలీసుల పాదాలను తాకి వేడుకున్నారు, ప్రజల వ్యతిరేకతను అర్థం చేసుకోలేని పోలీసులు అసహనంతో నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపి పేద రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారు. సున్నితమైన సమస్యలను బలప్రయోగంతో పరిష్కరించాలనుకొనే ఈ  చర్య, ప్రభుత్వ  వైఫల్యం కాదా?

ప్రకృతి సంపదను, గ్రామాలను.. కంపెనీలకు అమ్మేసి , వాటిలో విద్యుత్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, సెజ్ లను చూపించి, అభివృద్ధి అని నమ్మించి ప్రజలను బిక్షగాండ్లను చేయడమెందుకు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల వలన మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ దీపాల కాంతితో, నిరంతరం నడిచే పరిశ్రమలతో వెలిగిపోతుందనుకొంటే అది అమాయకత్వమే అవుతుంది. ఇవన్ని వాణిజ్య ప్రాతిపదిక మీద ఏర్పాటుకాబోతున్న ప్రాజెక్టులే కాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పనిసరిగా విద్యుత్ సరఫరా చెయ్యాలనే నిభంధన అంటూ ఏమి లేదు. మన రాష్ట్రం చిమ్మ చీకట్లో మగ్గిపోతున్నా ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు తమకు తోచిన విధంగా ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు, సంస్థలకు అమ్ముకునే అవకాశం ఉంది . మరి అటువంటప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని  గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ  భూములను, బ్రతుకులను  ఎందుకు త్యాగం చెయ్యాలి మరి ఎవరి జీవితాలలొనూ  వెలుగులు నింపని ఈ ప్రాజెక్టులకోసం.

శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం లోని 24   గ్రామాలలో  లక్ష ఎకరాలలో వ్యవసాయం  మరియు వ్యవసాయ అనుభంద వృత్తులపై  ప్రజలు ఆధారపడి  ఉన్నారు. అలాగే అక్కడున్న జల వనరులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు కూడా ఉన్నారు. వీరికి సంబందించిన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని ప్రవేట్ కంపెనీలకు ప్రాజెక్టుల కోసం కేటాయిస్తే, జీవనోపాధి కోల్పోతామన్న భయంతో సహజంగానే వ్యతిరేకత వస్తుంది. అంతే కాకుండా ఈ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన నీరు చుట్టుపక్కల ఉన్న చెరువులు, సరస్సుల నుండి పెద్ద మొత్తంలో వాడుకోవడం వలన తాగడానికి , సాగు చేయడానికి  నీరు కొరత ఏర్పడుతుందని స్థానికులలో భయం ఉంది.  థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు వాడే బొగ్గు నుండి కొన్ని కోట్ల టన్నుల బూడిద (carbon emissions) వచ్చి పర్యావరణానికి, వ్యవసాయ భూములకు, ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం కలిగే అవకాసం ఉంది. ఇన్ని భయాందోళనలు  ప్రజలలో ఉన్నందున, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు సుమారు 230  రోజుల నుండి శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.

బారత దేశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించాల్సిందే, మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకోవాల్సిందే కాని ఆహారభద్రత కల్పించే భారతీయ రైతుల, ఇతర అనుభంధ వృత్తుల ప్రజల జీవనోపాది కోల్పోయే విధంగా మాత్రం కాదు. ప్రాజెక్టులు కాని, SEZ లు కాని నిర్మించాలుచుకున్నపుడు, వ్యవసాయానికి పనికిరాని భూములను ఎంచుకోవచ్చు, ఒకవేళ తప్పనిసరిగా వ్యవసాయ భూములు అవసరం అయినప్పుడు తగిన పారితోషికం ఇవ్వటం ద్వారనో , భూమికి బదులుగా మరొక భూమిని సమకూర్చటం ద్వారానో నిరాశ్రయులు అయినవారిని ఆదుకోవచ్చు, ప్రాజెక్టుల ఉపయోగాన్ని  వివరించి ,ప్రజల అపోహలు తొలగించి, ఉద్రిక్తత నివారించే చర్యలు చేపట్టవచ్చు. అలాకాకుండా ఇటువంటి సున్నితమైన సమస్యలను బలప్రయోగం ద్వార పరిష్కరించాలనుకొంటే " వ్యవసాయ భూములన్ని ... యుద్ధ భూములుగా" మారగలవు.
మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com
Pic Courtesy: Eenadu News
´